సిపిఐకి ఇప్పుడే గుర్తొచ్చిందా?: సిపిఎం
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు సమదూరం పాటించాలనే వైఖరి సిపిఐకి ఇంతకు ముందు ఎందుకు గుర్తుకు రాలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో సిపిఐకి మద్దతు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాము పోటీ చేయని స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నామని, అయితే తెలుగుదేశంతో కలిసి ఉమ్మడి ప్రచారం చేయబోమని ఆయన చెప్పారు.
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంపై తమను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెసుకు లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుకు నీతి, పద్థతి లేదని ఆయన విమర్శించారు. తాము ఒక విధానం ప్రకారం కేంద్రంలో కాంగ్రెసుకు మద్దతిస్తున్నామని, కాంగ్రెసు తమ మద్దతు ఎందుకు తీసుకుంటోందని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే తాము ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు తమపై విమర్శలు చేయడం సహజమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
