నేను తెగిస్తే వారికి కష్టం: ఉప్పునూతల
హైదరాబాద్: తాను తెగిస్తే కాంగ్రెసులో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారికి కష్టాలు తప్పవని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న ఆలేరు శాసనసభా నియోజకవర్గంలో తన అనుచరులకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. పథకం ప్రకారమే తన అనుచరులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఆయన విమర్శించారు. అత్యుత్సాహం ప్రదర్శించి తననేమీ చేయలేరని ఆయన అన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో తనకు పూర్తి పట్టు ఉందని, తనకు బాధ్యతలు అప్పగించి ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ఉండేవాడినని ఆయన అన్నారు. ఆలేరులో కాంగ్రెసు అభ్యర్థిని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డే గెలిపించుకోవాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీ చేసేది తానేనని ఆయన చెప్పారు. తన ప్రాంతంలో తనకు చెప్పకుండా వేరే వారికి బాధ్యతలు అప్పగించడమేమిటని, తనకు చెప్పకుండా అభ్యర్థిని ఖరారు చేయడమేమిటని, తమాషా చేస్తున్నారా అని ఆయన అడిగారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెసును కాపాడుకుంటూ వస్తున్నానని ఆయన అన్నారు. తన జూనియరుకు బాధ్యతలు అప్పగించి తనను పని చేయమంటే ఎలా చేస్తానని ఆయన అన్నారు.
తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే కాంగ్రెసు పార్టీకి నష్టమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెసు మనుగడ కష్టమని కూడా ఆయన అన్నారు. తెలంగాణ గాలి బలంగా వీస్తోందని, తెలంగాణ సెంటిమెంటును ప్రతినిబింబించే వారినే ఉప ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 12 స్థానాల్లో ఓడిపోతే తెలంగాణ సెంటిమెంటు లేనట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications