బెంగుళూరు,మే 26: ఎట్టకేలకు దక్షిణాదిన ప్రభుత్వాన్ని స్దాపించాలన్న బిజెపి కల నెరవేరింది. అదీ మరో పార్టీ మద్దతుతో పని లేకుండా అధికార స్దాపనకు అవసరమైన స్పష్టమైన మైజార్టీతో గెలవడం వారి ఆనందానికి మరో కారణం. దక్షిణాదిన మొట్టమొదటి బిజెపి ముఖ్యమంత్రిగా మే 28న యెడ్యూరప్ప ప్రమాణం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫలితాలు వెలువడిన అనంతరం సుస్దిర ప్రభుత్వ స్దాపనకు అవకాశం ఇచ్చిన కర్ణాటక ప్రజలకు శ్రీ యెడ్యూరప్ప కృతఙ్ఞతలు తెలిపారు. షెడ్యూల్టు కులాలు, తరగతుల అభివృద్దికై ప్రత్యేక పథకాలను వేశపెడతామని యెడ్యూరప్ప మాట ఇచ్చారు. తన విజయానికి కారణమైన అరుణ్ జైట్లీకి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. అరుణ్ జైట్లీ మాత్రం వినయంగా ఈ విజయంలో తన ఘనత ఏమీ లేదని అన్నారు. "కర్ణాటకలో పార్టీ విజయం పార్టీ భౌగోళిక, సామాజిక విస్తరణలో ఒక మైలు రాయి, అది మాకు లోక్ సభ ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడుతుంది" అని బిజెపి అధ్యక్షుడు శ్రీ రాజ్ నాధ్ సింగ్ అన్నారు. సీనియర్ బిజెపి నాయకుడు శ్రీ వెంకయ్య నాయుడు "కర్ణాటకలో బిజెపి విజయం దేశ రాజకీయాల పై ప్రభావాన్ని చూపిస్తుందని" అన్నారు.