న్యూడిల్లీ: ఛాందసవాద శక్తుల నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనపై ఎన్ని దాడులు జరిగినా రచనలు చేయడం మాననని వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. తన నవల శోధ తెలుగు అనువాదం ఆవిష్కరణ సందర్బంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. "తన రచనల గురించి ఏమాత్రం అవగాహన లేని అతివాదులు రాజకీయ ప్రయోజనాలకోసమే నన్ను లక్ష్యంగా చేసుకుని పదే పదే దాడులు చేస్తున్నారు. కొందరు అతివాదులు నన్ను వెంటాడుతున్నారు. వారు నా భావాల్ని ప్రజలకు చేరకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు. కానీ మిగతా వారిలా నేను వారి బెదిరింపులు, దాడులు, ఫత్వాలకు భయపడేదాన్ని కాదని గత అనుభవంనుండి వారు తెలుసుకోవాలి. భారత ప్రజాస్వామ్య విధానం పై నాకు పూర్తి విశ్వాసం ఉంది" అని తస్లీమా నస్రీన్(46) అన్నారు. అన్ని మైనార్టీ ఫోరం ల తీవ్ర ప్రతిఘటన కారణంగా తస్లీమాను గత సంవత్సరం నవంబర్ లో కోల్ కతా నుండి బహిష్కరించారు. భధ్రతా కారణాల దృష్ట్యా కొన్నాళ్ళు డిల్లీలో ఒక రహస్య ప్రదేశంలో నివసించి అనంతరం గత మార్చి లో స్వీడన్ కి వెళ్ళింది.