కెసిఆర్ కొనసాగాల్సిందే: జయశంకర్
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాస్తవాలను గ్రహించడానికి లోపాలను విశ్లేషించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. తెరాసను విస్మరించి రాజకీయాలను నడిపే స్థితిలో రాజకీయ పార్టీలు లేవని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు రాజీనామా నేపథ్యంలో బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణవాదానికి అనుకూలమని చెప్పాయని, ఆ పార్టీలు ఇచ్చిన హామీలు నిజమైనవా, బూటకమైనవా అని నిలదీయాల్సి ఉందని, అందుకు ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిందేనని ఆయన అన్నారు.
తెలంగాణవాదం బలపడిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే సిపిఎం కూడా అంటోందని, ఇది తమ పార్టీ సాధించిన విజయమని ఆయన చెప్పారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. ప్రతికూల పరిస్థితుల చారిత్రక, సామాజిక బాధ్యత ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ ను నాయకత్వం నుంచి తప్పుకోనివ్వమని ఆయన అన్నారు. తెలంగాణ వ్యతిరేకుల దృష్టంతా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారిపై, ముఖ్యంగా కెసిఆర్ పై ఉందని ఆయన అన్నారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలంగా రాజకీయ ప్రక్రియ, భావజాలరంగంలో కృషి, ఆందోళనలు అనే మూడు ప్రక్రియలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమం వ్యవస్థీకృతమైందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి విరామం మాత్రమే ఉందని, విరమణ లేదని ఆయన అన్నారు. కెసిఆర్ నాయకత్వం కొనసాగడం అనివార్యమని ఆయన అన్నారు. అంతిమ విజయం తమదేనని, చిత్రీకరించినంత ప్రమాదమేమీ జరగలేదని, మంచే జరిగిందని, లోపాలను తరిచి చూసుకునే అవకాశం కలిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications