పెట్రో ధరలపై ప్రశాంతంగా రాష్ట్ర బంద్
హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా ప్రతిపక్షాలు రాష్ట్రంలో శుక్రవారం చేపట్టిన ప్రశాంతంగా బంద్ జరుగుతోంది. తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. బిజెపి రైల్ రోకో చేపట్టింది. పలు చోట్ల ప్రతిపక్షాల కార్యకర్తలు బస్సులను, రైళ్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషనులో రైలో రోకో నిర్వహించిన బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముషీరాబాదులో సికింద్రాబాదు వైపు దూసుకెళ్తున్న వామపక్షాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద వామపక్షాల కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాదులో బంద్ పాక్షికంగా జరుగుతోంది. ఆర్టీసి బస్సులు కొన్ని నడుస్తున్నాయి. దుకాణాలు, సంస్థలు అక్కడక్కడా తెరిచే ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం, సిపిఎం బంద్ నిర్వహించాయి. తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు రిక్షా తొక్కి తన నిరసనను వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లాలోని పాయకరావు పేట వద్ద ఆందోళనకారులు స్టీల్ సిటీ - చెన్నై ఎక్సుప్రెస్సును నిలిపేశారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. శ్రీశైలంలో తెలుగుదేశం కార్యకర్తలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ఖమ్మంలో సిపిఐ కార్యకర్తలు బస్సుల అద్దాలు పగులగొట్టారు. నిజామాబాద్ జిల్లాలోని ఆరు బస్సు డిపోల వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications