ఏపీ, బెంగళూరు మీదుగా వెళ్లే ఈ డైలీ ఎక్స్‌ప్రెస్ స్పీడ్ పెంపు, టైమింగ్స్ మార్పు: హాల్ట్ స్టేషన్లు
తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపికబురు ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింతగా మెరుగుపరచడంలో భాగంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పెంచాలని నిర్ణయించింది. దీంతో కాచిగూడ- అశోకపురం (మైసూరు) మధ్య నడిచే డైలీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గుతుంది. ఈ మార్పులు ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి వస్తాయి.
కాచిగూడ- అశోకపురం (మైసూరు) మధ్య దూరం 763 కిలోమీటర్లు. ఈ దూరాన్ని అధిగమించడానికి ప్రస్తుతం నంబర్ 12785 కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 14 గంటల 45 నిమిషాలు తీసుకుంటోంది. ఈ రైలు సగటు వేగం గంటకు 51.74 కిలోమీటర్లు. దీన్ని 13 గంటల 50 నిమిషాలకు తగ్గించేలా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. రైలు సగటు వేగాన్ని గంటకు 55.17 కిలోమీటర్లకు పెంచింది దక్షిణ మధ్య రైల్వే.

ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు ఒక గంట సమయం ఆదా అవుతుంది. ఇది ఆగస్టు 25 నుంచి అమలులోకి వస్తుంది. నంబర్ 12785 ఎక్స్ ప్రెస్ కాచిగూడ నుంచి సాయంత్రం 7:05 నిమిషాలకు బదులుగా 7:45 నిమిషాలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9:55 గంటల కంటే ముందే అంటే ఉదయం 09:35 నిమిషాలకే అశోకపురానికి చేరుకుంటుంది.
అశోకపురం నుంచి కాచిగూడ వైపు వచ్చే నంబర్ 12786 ఎక్స్ ప్రెస్ వేగం కూడా గణనీయంగా పెరుగనుంది. ఈ రైలు ప్రస్తుతం తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 14 గంటల 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. సవరించిన వేగ పరిమితి నేపథ్యంలో 13 గంటల 50 నిమిషాల్లోనే గమ్యం చేరుకుంటుంది. 55 నిమిషాల సమయం రైల్వే ప్రయాణికులకు కలిసి రానుంది.
ఈ రైలు అశోకపురం నుంచి మధ్యాహ్నం 2:55 నిమిషాలకు యథావిధిగా బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 గంటలకు బదులు తెల్లవారుజామున 4:45 నిమిషాలకే కాచిగూడ చేరుకుంటుంది.
జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపుర, యలహంక, బెంగళూరు ఈస్ట్, బెంగళూరు కంటోన్మెంట్, కేఎస్ఆర్ బెంగళూరు, కెంగేరి, రామనగర, మండ్య, మైసూరు మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. రైలు వేగం పెరిగిన నేపథ్యంలో ఆయా స్టేషన్ల రాక/పోకల సమయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications