గుంటూరు: రూ. 50 చొప్పున పెరిగిన వంట గ్యాస్ ధరను తామే భరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించారు. అయితే పెట్రోలు, డీజిల్ ధరలలో మాత్రం తామేమీ చేయలేమని తెలిపారు. గుంటూరులోని పిచికలగుంట మైదానంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రజాప్రస్థానం ముగింపు సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన గ్యాస్ ధరలతో మహిళలు ఇబ్బందుల పాలుకాకుండా ఉండేందుకు భరించేందుకు నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఉన్న కోటి అయిదు లక్షల వంట గ్యాస్ కనెక్షన్లకు పెరిగిన ధరల్లో కాస్తయినా భాగం పంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే గ్యాస్ ధరలను భరించాలని నిర్ణయించినట్టు చెప్పారు.