గుత్తాను తప్పు పట్టిన ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణవాదాన్ని వినిపిస్తున్నందుకే తనపై వేటు వేయడానికి ప్రయత్నిస్తున్నారని తమ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన విమర్శను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు తప్పు పట్టారు. నల్లగొండ జిల్లా ఆలేరు శాసనసభా నియోజకవర్గంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ మాట వాస్తవమని, అందుకే గుత్తాపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి సిద్దపడిందని ఆయన అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమైనా చెప్పదలుచుకుంటే పార్టీకి చెప్పాలని, ఈ విధంగా బహిరంగంగా మాట్లాడటం సరి కాదని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ ధిక్కారస్వరం వినిపించలేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన ఎర్రబెల్లి దయాకరరావు గురువారంనాడు శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇదిలా వుంటే, తాను తెలంగాణవాదాన్ని వినిపిస్తూనే ఉంటానని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి వరంగల్ లో అన్నారు. తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని వీడి వస్తే దేవేందర్, కడియంలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని బిజెపి నాయకుడు సిహెచ్. విద్యాసాగరరావు గురువారం కరీంనగర్ లో అన్నారు. తెలుగుదేశంలోని అంతర్యుద్ధంతో తెలంగాణ ఉద్యమం మంచి మలుపు తిరిగిందని ఆయన అన్నారు. తెలంగాణవాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
