కొత్త వివాదంలో ఆరా మస్తాన్- పోలీసు కేసు, నోటీసులు..!!
ప్రముఖ రాజకీయ సర్వే విశ్లేషకుడు, ఆరా పోల్ స్ట్రాటజీస్ అధినేత ఆరా మస్తాన్‌పై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్‌లో రూ.కోట్ల విలువ పలికే వివాదాస్పద భూమిని నకిలీ పత్రాలు సృష్టించి చేజిక్కించుకునేందుకు యత్నించారనే ఫిర్యాదు పై విచారణ మొదలైంది. దీని పైన కేసు నమోదు చేసి.. పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఈ ఆరోపణల వెనుక వాస్తవాలను గుర్తించే దిశగా విచారణ కొనసాగుతోంది.
ఆరా పోల్ స్ట్రాటజీస్ అధినేత ఆరా మస్తాన్‌పై కేసు నమోదు అయింది. మదాపూర్ గుట్టల బేగంపేట్ లో ఓ భవన నిర్మాణానికి తప్పుడు పత్రాలు సమర్పించి అనుమతి పొందినట్లు అందిన ఫిర్యాదు పై మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం లో ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆరా మస్తాన్ కు పోలీసులు నోటీసులు చేసారు. తాను విచారణకు వస్తానని మస్తాన్ తెలిపారు. నిర్మాణ అనుమతుల కోసం సమర్పించిన పత్రాల ప్రామాణికత.. వాటిని ఎవరు సమర్పించారు.. అనుమతులు ఎలా పొందారనే అంశాల పై పోలీసులు ఫోకస్ చేసారు. దర్యాప్తు పూర్తయిన తరువాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

పోలీసుల విచారణ.. నోటీసులు
గుట్టల బేగంపేట సర్వే 32 పరిధిలోని ప్లాట్ నెంబర్ 55కు కిరణ్ మోహన్ యజమానిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండటంతో ఆయన సోదరుడు మదన్ మోహన్ సైబరాబాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయటంతో తప్పుడు పత్రాలతో భవన నిర్మాణ అనుమతులు పొందిన విషయం వెలుగు లోకి వచ్చింది. దీంతో.. అధికారులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కెట్‌లో రూ.కోట్ల విలువ పలికే వివాదాస్పద భూమిని నకిలీ పత్రాలు సృష్టించి చేజిక్కించుకునేందుకు యత్నించారనే ఫిర్యాదులు రావడంతో ఈ వ్యవహారం అధికార, పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో వాస్తవాలు పోలీసుల విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
