ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్ .. ఇకపై రేషన్, ఆధార్ తోనే నివాస ధృవీకరణ.. కానీ!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాలనను సమర్ధవంతంగా చేయటం కోసం, ప్రజలకు అందించే సేవలను చాలా సులభతరం చేస్తుంది. ఇప్పటికే ప్రజలు ఇంట్లో నుండే వారికి కావాల్సిన డాక్యుమెంట్ లను వాట్సప్ ద్వారా, యాప్ ల ద్వారా పొందే వీలు కల్పిస్తే, తాజాగా నివాస ధృవీకరణ సర్టిఫికేట్ విషయంలో ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన ఉపశమనం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. రెసిడెన్స్ ప్రూఫ్ లేదా నివాస ధ్రువీకరణకు సంబంధించి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డును అధికారిక రుజువుగా అంగీకరించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజలు ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం సామాన్యులకు లేకుండా పోతుంది.

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ సేవల కోసం ఆధార్ మరియు రేషన్ కార్డులను నివాస ధ్రువీకరణకు ఉపయోగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం పడిగాపులు పడే బాధ తప్పింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో రెసిడెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి అని కూడా పేర్కొంది. మాములుగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందే వారికి రేషన్ కార్డు, ఆధార్ ఉంటే సరిపోతుంది.
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, కేంద్ర సంస్థల్లో నియామకాలు వంటి వాటికి కూడా రేషన్ కార్డు లేదా ఆధార్‌ను రెసిడెన్స్ ప్రూఫ్‌గా సమర్పించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం నివాస ధ్రువీకరణ పత్రం అవసరం కావచ్చు. సైనిక దళాల రిక్రూట్‌మెంట్, కొన్ని నిర్దిష్ట నియామకాలు వంటి వాటికి తహసీల్దారు జారీ చేసే అధికారిక నివాస ధ్రువీకరణ పత్రం కావాల్సి రావచ్చు.
ఇప్పటికే ఎవరైనా అలాంటి పత్రం తీసుకుని ఉంటే మళ్లీ కొత్తగా జారీ చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టత ఇచ్చారు. నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారం మళ్లీ తహసీల్దార్లకు అప్పగించబడింది. ఒకవేళ తప్పనిసరి రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలంటే దరఖాస్తుదారులు అవసరమైన ఆధారాలతో తహసీల్దారు కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా ఆధారాలు లేకపోతే తహసీల్దారు స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధ్రువీకరించి పత్రం జారీ చేయవచ్చు.
ఆదివాసీ గిరిజనకుటుంబాల వారికి ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ కోసం తహసీల్దార్లు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చింది.ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు, ప్రభుత్వ పథకాలు పొందడానికి అవసరమైన డాక్యుమెంట్ల కోసం ఏ ఇబ్బంది లేదు. రేషన్ కార్డు, ఆధార్ ఇప్పటికే చాలా మంది వద్ద ఉన్నందున సామాన్యులపై అదనపు భారం తగ్గుతుంది. ప్రభుత్వం ఈ మార్పులను స్పష్టంగా ఉత్తర్వుల రూపంలో జారీ చేయడం వల్ల అధికారులకు కూడా మార్గదర్శకత్వం లభిస్తుంది.













Click it and Unblock the Notifications
