అసలది తిరుమల లడ్డూనే కాదు: టీటీడీ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. బుధవారం నాడు 71,196 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 22,581 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 2.46 కోట్ల రూపాయల మేర కానుకలు టీటీడీకి అందాయి. 3.69 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. 1.61 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై ఏణి కన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నిచ్చెన ఎక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను తలపించే ఈ అలంకారం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. జ్యోతిషశాస్త్రంలో ముత్యాలు.. చంద్రుడికి ప్రతీక. శ్రీకృష్ణుడు ముక్కు, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల పందిరిగా స్వీకరించి శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ వాహనసేవ విశిష్టత. ఈ ముత్యాల పందికి కింద కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం వల్ల తాపత్రయాలు తొలగి, భక్తుల జీవితాల్లో సుఖశాంతులు, సకల శుభాలు చేకూరుతాయని పురాణ ప్రశస్తి.
ఈ సందర్భంగా భక్తులతో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ముచ్చటించారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, లడ్డూ ప్రసాదం, వాహనసేవల వీక్షణకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వీటిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సేవలను మెరుగుపర్చడానికి భక్తులు ఇచ్చిన సూచనలు, సలహాను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
కాగా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యమని టీటీడీ పేర్కొంది. ఈ ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది. ఆ ఫొటోలో ఉన్నది అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదం కానే కాదనీ తేల్చి చెప్పింది. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని సూచించింది. లడ్డూ తయారీ విషయంలో ప్రత్యేకగా శ్రద్ధ తీసుకుంటామని వివరించింది.
ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారని, కొందరు ఉద్దేశపూరకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అవాస్తవాలను ప్రచారం చేస్తోన్నారని, ఇది మంచిది కాదని సూచించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలియజేసింది.














Click it and Unblock the Notifications
