హరిబాబుని నేనే చంపేశా.. నిజం ఒప్పుకున్న యూట్యూబర్ వైష్ణవి అన్న
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడు సంతోశ్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. తన చెల్లిని చంపినందుకు ప్రతీకారంగా హరిబాబును చంపినట్లు ఆ వీడియోలో వెల్లడించాడు సంతోష్. ఈ మేరకు సంతోశ్ కోరుట్ల పోలీసులకు లొంగిపోయాడు. ఇక అంతకుముందు నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును సంతోష్ దారుణంగా నరికి చంపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే మొదట పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు హరిబాబును తానే చంపేశానని సంతోష్ చెప్పడం సంచలనంగా మారింది.
తన చెల్లికి జరిగినట్టు ఇతరులకు జరగకూడదనే హరిబాబుని చంపేశానని తెలిపాడు సంతోష్. ప్రభుత్వాలు న్యాయం చేయలేదు కాబట్టే.. తాను ఇలా చేశానని వీడియోలో సంతోష్ వెల్లడించాడు. ప్రజలందరూ తనకు సపోర్ట్ చేసి.. బయటకు వచ్చేలా సహకరించాలని సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో సంతోష్ లొంగిపోయాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (19), కోరుట్ల పట్టణంలోని ఏసుగోనిగుట్ట ప్రాంతానికి చెందిన హరిబాబుతో వివాహం జరిగింది. అయితే వైషూ అమ్ము పేరుతో యూట్యూబర్ గా గుర్తింపు పొందిన వైష్ణవి ఈ ఏడాది మార్చిలో దారుణ హత్యకు గురైంది. ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి అని సమాచారం. భర్త హరిబాబు ఆమెను గొంతు నులిమి చంపడమే కాకుండా, చేతులు, నుదుటిపై కత్తితో పొడిచినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు మొన్నటి వరకూ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే వైష్ణవి సోదరుడు సంతోష్.. హరిబాబును కత్తితో నరికి కిరాతకంగా హత్య చేశాడు.












Click it and Unblock the Notifications
