దేవేందర్ గౌడ్ తో గుత్తా భేటీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో తెలంగాణ లొల్లి మరింత ముదిరింది. మరో తెలుగుదేశం నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ విషయంలో పార్టీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం ఉదయం దేవేందర్ గౌడ్ ను కలిసి మంతనాలు జరిపారు. కాకినాడలో జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణపై నాయకత్వం తీరుపై దేవేందర్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డిపై వేటు వేసే విషయంపై కూడా చర్చకు వచ్చింది. నల్లగొండ జిల్లా ఆలేరు శాసనసభా నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుకు వ్యతిరేకంగా పని చేసినందుకు సుఖేందర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. అయితే దేవేందర్ గౌడ్ సుఖేందర్ రెడ్డిపై వేటుకు అడ్డుకట్ట వేశారు.
నల్లగొండ జిల్లాలో సుఖేందర్ రెడ్డి బలమైన నాయకుడని, సుఖేందర్ రెడ్డిపై వేటు వేస్తే పార్టీకి నష్టమని, కొద్ది కాలం ఆగుదామని ఆయన సూచించారు. దీంతో సుఖేందర్ రెడ్డిపై వేటు వేసే విషయాన్ని సమావేశం వాయిదా వేసింది. ఈ స్థితిలో గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం ఉదయం దేవేందర్ గౌడ్ తో సమావేశమయ్యారు. ఈ నెల 18వ తేదీన ఐదుగురు సభ్యుల కమిటీ సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నారు. దేవేందర్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సికింద్రాబాద్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ పై చర్యలకు ఉపక్రమించకపోవడాన్ని వారు తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications
