మహబూబ్‌నగర్ : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆరునెలల పాటు మాత్రమే ఉంటుందని అనంతరం టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మీకోసం యాత్రలో భాగంగా ఆయన రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో పర్యటించారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో ప్రవేశించారు. దేవేందర్ సొంతగ్రామంలో బాబు యాత్రకు చక్కని స్పందన లభించింది. వేలసంఖ్యలో వచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్ని పార్టీలు వచ్చినా టీడీపీకి ఢోకా లేదని ఆయన చెప్పారు. ప్రజల అండతో వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఊసరవెల్లి వైఖరిని ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు.