పేలుడు పదార్థాల కార్లపై దర్యాప్తు
సూరత్: పేలుడు పదార్ధాలతో రెండు కార్లు పోలీసుల చేతికి చిక్కిన సంఘటనలకు సంబంధించి పోలీసులు సూరత్ లో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసు కమీషనర్ ఆర్.ఎం.ఎస్. బ్రార్ సోమవారం ఈ విషయం చెప్పారు. సూరత్ లో కార్లలో పేలుడు పదార్థాలు పెట్టిన సంఘటనలకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగలేదని, అయితే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు.
ఆదివారంనాడు కార్లలో లభించిన పేలుడు పదార్థాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపినట్లు ఆయన తెలిపారు. పేలుడు పదార్థాలున్న కార్ల నెంబర్ల ప్లేట్లు వడొదరాకు సంబంధించినవని గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఆ నెంబర్ ప్లేట్లు టూ వీలర్లకు సంబంధించినవని, పోలీసులను తప్పు దారి పట్టించడానికి నకిలీ నెంబర్ ప్లేట్లను వాడారని ఆయన చెప్పారు. న్యూసిటీ లైట్ లోని ఒక ఆస్పత్రి వద్ద బాంబును నిర్వీర్యం చేసినట్లు ఆయన చెప్పారు. సూరత్ లో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పేలుడు పదార్థాలున్న రెండు కార్లు దొరకడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మాల్స్, సినిమా హాళ్లను, రెస్టారెంట్లను ముందు జాగ్రత్త చర్యగా మూసేశారు.












Click it and Unblock the Notifications