సెప్టెంబర్ 4న మరోసారి అణు ఇంధన సమావేశం
వియన్నా : రెండు రోజులపాటు జరిగిన కీలక అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ) సమావేశం భారత్‌కు నిరాశను మిగిల్చింది. ఎన్‌ఎస్‌జీ దేశాలు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తే ఇతర దేశాలతో అణు వాణిజ్యం జరుపుకునే వీలు కలుగుతుందని భారత్ ఆశపడింది. అయితే ఎన్ఎస్‌జీ దేశాలు శుక్రవారంతో ముగిసిన ఈ సమావేశంలో భారత్‌పై అంతర్జాతీయ నిషేధం ఎత్తివేయడానికి సంబంధించి ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.
దీంతో ఇదే అంశాన్ని పరిశీలించేందుకు సెప్టెంబర్ 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి. చాలా ఏళ్ల క్రితం భారత్‌కు ఇతరదేశాలతో అణు వాణిజ్యం జరుపుకోకుండా ఎన్ఎస్‌జీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు కూడా ఎన్ఎస్‌జీ ఈ నిషేధాన్ని ఎత్తివేయడం అవసరమవుతుంది.
ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమైన 45 సభ్యదేశాలు కలిగిన ఎన్ఎస్‌జీ సమావేశంలో భారత్ తన అణు కార్యక్రమంపై వివరణ ఇచ్చింది. భారత్ ఇచ్చిన వివరణతో అనేక దేశాలు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, స్విజ్జర్లాండ్, ఆస్ట్రియా, న్యూజీలాండ్ తదితర దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ దేశాల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని సెప్టెంబర్ 4, 5 తేదీల్లో జరిగే ఎన్ఎస్‌జీ దేశాల సమావేశంలో భారత్ మరోసారి వివరణ ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications