హైదరాబాద్: రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కొందరు మంత్రులు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవచ్చని ముఖ్యమంత్రి నేటి మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రులకు ముఖ్యమంత్రి అనేక సూచనలు చేశారు. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు బాగుండలేదని, వారు రెండో మూడో స్ధానంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. అధికారుల అలసత్వంతో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చేసుకోవాలని ఆయన మంత్రులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల మీద సరైన అవగాహన తెచ్చుకుని అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి సూచించారు.