పాత్రలు బాధ్యత గుర్తు చేశాయి: చిరు
తిరుపతి: సినిమాల్లో బడుగు వర్గాల పాత్రలే వేశానని చిరంజీవి అన్నారు. తాను పోషించిన ప్రతి పాత్రా తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నదని ఆయన అన్నారు. తనకు గంజి గురించి తెలుసు, బెంజి గురించి తెలుసు అని ఆయన అన్నారు. ప్రాణఖరీదులో దళిత యువకుడి పాత్ర పోషించానని, స్వయంకృషిలో చెప్పులు కుట్టే వాడి పాత్ర వేశానని ఆయన అన్నారు. ఫిక్షన్ పాత్రలు, అవాస్తవిక పాత్రలు వేయలేదని ఆయన చెప్పారు. తాను జీవితంలో ఈ అంచు నుంచి ఆ అంచు దాకా చూశానని ఆయన చెప్పారు. తాను జీవితంలో ఏదీ కోల్పోలేదని ఆయన చెప్పారు. ప్రజలు చూపించే ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటానని ఆయన అన్నారు. మొగల్తూరు నుంచి న్యూయార్క్ వరకు అంతా తిరిగానని, అన్నీ చూశానని ఆయన అన్నారు.
విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేయడానికి రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన సమయం వచ్చిందని, పిలుపు వచ్చిందని తాను తన అమ్మతో చెప్పానని, రాజకీయాలు చూస్తుంటే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు, నువ్వు ఇప్పటి వరకు ఎవరితో మాట పడలేదు, భరించగలవా అని అడిగిందని, పారదర్శతతో చిత్తశుద్ధితో ఆకలిదప్పులతో అలమటిస్తున్న వారి మేలు కోసం మార్గం వేయాలని కలామ్ చెప్పిన మాటలను తాను చెప్పానని, దాంతో నీ ఇష్టం అని, అయితే ఒక్కడివే ఏం చేయగలవని అన్నదని ఆయన వివరించారు. ఇంత బిందువు సింధువు అయిందని, ఇది మార్పునకు నాంది కావాలని అన్నానని ఆయన వివరించారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లడమే, వెను తిరిగేది లేదని, మీరు నాయకుడ్ని కాదు, మీ సేవకుడ్ని అని ఆయన అన్నారు. రాజకీయాలు వేరు, సేవ వేరు అయిన ఈ స్థితిలో సేవే రాజకీయం కావాలని, అదే తమ లక్ష్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications