చిరంజీవికి మందకృష్ణ ప్రశ్నలు
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్)నేత మందకృష్ణ మాదిగ తీవ్రంగా ధ్వజమెత్తారు. అణగారిన కులాలకు ప్రాధాన్యం ఇచ్చి సామాజిక న్యాయం సాధిస్తానని చెప్పిన చిరంజీవి అందుకు అనుగుణంగా వ్యవహరించడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి తొలి రాజకీయ నియామకాల్లోనే అగ్రకులాలవారికి పెద్ద పీట వేశారని ఆయన అంటూ దీన్ని బట్టి మిగతా అగ్రకుల పార్టీలకు, చిరంజీవికి పార్టీకి తేడా లేదని, చిరంజీవి వల్ల మార్పు రాదని అర్థమవుతోందని ఆయన అన్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా నియమితులైన మిత్రా, పరకాల ప్రభాకర్ ఇద్దరు కూడా అగ్రకులాలవారేనని ఆయన అన్నారు. పైగా మిత్రా చిరంజీవి మామ అల్లు రామలింగయ్య మిత్రుడి కుమారుడని, పరకాల ప్రభాకర్ చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ మిత్రుడని, ఈ రకంగా బంధుమిత్రులకు చిరంజీవి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. మిత్రా పోరాటాలు చేసినవారు కాదని, చాలా కాలం విదేశాల్లో ఉన్నారని, మిత్రాకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేదని ఆయన అన్నారు. పరకాల ప్రభాకర్ కు అణగారిన వర్గాల ఉద్యమాలతో ఏ మాత్రం సంబంధం లేదని ఆయన అన్నారు.
అణగారిన వర్గాల కోసం ఉద్యమాలకు నాయకత్వం వహించినవారు చిరంజీవి పార్టీ పెడతారని తెలియగానే వచ్చి చేరారని, వారెవరినీ చిరంజీవి అధికార ప్రతినిధులుగా నియమించకపోవడాన్ని బట్టి కూడా అణగారిన వర్గాల కోసం చిరంజీవి పార్టీ పనిచేయదని తెలుస్తున్నదని ఆయన అన్నారు. కత్తి పద్మారావు దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించారని, అయినా కత్తి పద్మారావుకు అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. తన కోసం, తాను అధికారం సాధించడం కోసం మాత్రమే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తన కోసం, తన సామాజిక వర్గం కోసం మాత్రమే చిరంజీవి పార్టీ పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల ప్రజలు చైతన్యం పొంది రాజకీయాధికారం సాధించుకోవడానికి సమాయత్తమైన సమయంలో చిరంజీవి పార్టీ పెట్టారని, అందువల్ల చిరంజీవి పార్టీ అణగారిన వర్గాలకు రాజకీయాధికారం సాధించి పెట్టలేరన్న సత్యాన్ని సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న బడుగు నేతలు గుర్తించాలని ఆయన అన్నారు. చిరంజీవి బడుగు వర్గాల ప్రయోజనం కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, తన అగ్రకుల సామాజిక వర్గం అధికారం కోసం వచ్చారని ఆయన విమర్శించారు. తాను చేసిన విమర్శలకు చిరంజీవి స్వయంగా ప్రతిస్పందించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications