చట్టసభల్లో బిసి కోటాకు తీర్మానం
హైదరాబాద్: చట్టసభల్లో వెనకబడిన కులాలకు (బిసిలకు) 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్నాన్ని కోరుతూ శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆ తీర్మానాన్ని సభలో ప్రతిపాదించారు. తెలుగుదేశం పార్టీ తీర్మానానికి సవరణను సూచించింది. పార్లమెంటులో కూడా బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా తీర్మానంలో కేంద్రానికి సూచించాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సూచించారు. అందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అంగీకరించారు.
తాము బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 1996లోనే తీర్మానం చేశామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. తాము తీర్మానం చేయడం వల్ల ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి తీర్మానాలు చేసే అవకాశం ఉంటుందని, దీనివల్ల కేంద్రం ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ శాసనసభ్యుడు డి. శ్రీనివాస్ అన్నారు. బిసిల్లోని కొన్ని కులాలు ఎస్సీల కన్నా వెనకబడి ఉన్నారని సిపిఎం సభ్యుడు నోముల నర్సింహయ్య అన్నారు. ఇది మొదటి ఏడాదిలోనే చేసి ఉంటే సంతోషించేవాళ్లమని ఆయన అన్నారు. దీనిపై అఖిల పక్ష కమిటీని ఒక్కటి ఢిల్లీకి తీసికెళ్లి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications