తెలంగాణపై టిడిపి పూర్తి అనుకూలం?
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి వాతావరణం ఏర్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజారాజ్యం వ్యవస్థాపక నేత చిరంజీవితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు ఈ మధ్య సమావేశమైనట్లు వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీ తొందరపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణపై ఏర్పాటైన కోర్ కమిటీ మంగళవారం పార్టీ ఎమ్మెల్సీల అభిప్రాయాలను సేకరించింది. ఎమ్మెల్సీలు తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించాలని కూడా వారు కమిటీ సభ్యులకు చెప్పారు.
కోర్ కమిటీ ఈ నెల 4,5,6 తేదీల్లో పార్టీ శాసనసభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షకార్యదర్శుల అభిప్రాయాలు తీసుకుంటుంది. తెరాసతో పొత్తును ఖాయం చేసుకోవడానికి తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కదులుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. పొత్తులకు ప్రజారాజ్యం పార్టీ కూడా ముందుకు వస్తుండడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో వామపక్షాలతోనూ, తెరాసతోనూ పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ పావులను కదిపే పనిలో వడిందని భావించవచ్చు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications