అసెంబ్లీలో కరెంట్ 'కోతలు'
హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్ కోతపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి నిరసనగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. తెలుగుదేశం, సిపిఎం, తెరాస సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. హైదరాబాదులో కరెంట్ కోతపై మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ వేసిన ప్రశ్నకు విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ సమాధానం ఇస్తూ కరెంట్ కొరతకు గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని, తొమ్మిదేళ్ల పాలనలో ఇసుమంత కూడా విద్యుదుత్పత్తి పెరగలేదని అన్నారు. దీనికి ఆగ్రహించిన తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి - ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడికి దిగుతోందని అన్నారు. తాము వ్యవసాయానికి కచ్చితంగా 9 గంటలు విద్యుత్ ఇచ్చామని ఆయన చెప్పారు. రైతులను, పారిశ్రామికవేత్తలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. రైతులకు రోజుకు మూడు నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని తెరాస సభ్యుడు ఈటెల రాజేందర్ విమర్శించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోజుకు 9 గంటలు వ్యవసాయానికి విద్యుత్తు ఇచ్చామనే మాట సత్యదూరమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రభుత్వం రోజుకు 7 గంటలు విద్యుత్తు ఇవ్వడం ద్వారా గంటకు 400 కోట్ల రూపాయలు ఆదా చేసుకుంటన్నట్లు చేస్తున విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని - విద్యుత్తు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టిందని అన్నారు. రెండు నెలలు వర్షాలు రాకపోతే భారం దేవుడిపై వేసి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ కోత ఉందని తాను నిరూపిస్తానని, ఈ విషయంపై నిర్ధారణ చేసుకోవడానికి ఏ గ్రామానికైనా తనతో పాటు రావాలని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications
