సౌమ్య హత్య కేసు: దొరకని క్లూ
హైదరాబాద్: అమెరికాలో హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సౌమ్యా రెడ్డి, ఆమె సోదరుడు తుమ్మల విక్రం కుమార్ రెడ్డి శవాలను రాష్ట్రానికి తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రమాకాంత్ రెడ్డి చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ కు, వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం కూడా ఈ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం అధికారి బి. బాలభాస్కర్ ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాయలం అధికారులను సంప్రదిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే గానీ వారి శవాలను పంపించడం సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు. ఇందుకు కనీసం మూడు వారాలైనా పడుతుందని సమాచారం.
తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లదలుచుకుంటే తాము తగిన సహకారం అందిస్తామని, తాత్కాలిక పాస్ పోర్టులు ఇస్తామని బాలభాస్కర్ చెబుతున్నారు. తమ కుమారుడి హత్యకు సంబంధించిన సమాచారం విక్రం రెడ్డి తల్లిదండ్రులకు అందడంలేదు. దీంతో వారు తీవ్రంగా కలవరం చెందుతున్నారు. ఇద్దరి శవాలు లభ్యమైన స్పానిష్ లేక్ కౌంటీ పార్కు వద్ద దర్యాప్తు అధికారులు గన్ కోసం గాలింపు చేపట్టారు. శవాలకు సెయింట్ లూయిస్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ పోస్టు మార్టం నిర్వహించారు. అయితే ఆ పోస్టు మార్టం పరీక్షల ఫలితాలను వెల్లడించడానికి వారు నిరాకరిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారంరాత్రి 9 శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు మధ్య జరిగినట్లు భావిస్తున్నారు.
విక్రంరెడ్డి శవం సన్ఫిష్ సరస్సులో తేలిన విషయం తెలిసిందే. అతను ఒకే గన్ షాట్ తో మరణించినట్లు భావిస్తున్నారు. అతని నోటిపై అందుకు సంబంధించిన గాయం ఉంది. అయితే అంతకు మించి ఈ ఇద్దరి హత్యకు సంబంధించిన ఆధారాలు అమెరికా పోలీసులకు లభించడం లేదని తెలుస్తోంది. వారిని నల్లజాతీయులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications