సరసాదేవితో మాట్లాడలేదు: భవానీ
హైదరాబాద్: డిపెప్ కుంభకోణంలో నిందితురాలు సరసాదేవితో తాను ఏనాడూ మాట్లాడలేదని భవానీ అంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిపెప్ కుంభకోణంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న భవానీని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. భవానీని పోలీసులు ఎర్రగొండెపాలెంలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆమెను ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను హైదరాబాదులోని చంచల్ గుడా జైలుకు తరలించారు.
డిపెప్ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఈ కేసులో ఇరికించారని భవానీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన జీవితాన్ని అన్యాయం చేశారని కూడా అంటోంది. తాను మూడు నెలల పాటు సరసాదేవి కుమార్తె వద్ద పని చేశానని, అనారోగ్యం కారణంగా ఆ తర్వాత పని మానేశానని ఆమె చెబుతోంది. మల్లెపువ్వు సీరియల్ కు నటీనటులు కావాలనే పత్రికా ప్రకటన చూసి రామారావు ద్వారా దరఖాస్తు చేసి అక్కడ చేరానని ఆమె చెప్పింది. సరసాదేవి కుమార్తె ఆ సీరియల్ దర్శకత్వం వహించారు.
తనతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఎందుకని అడిగితే వేతనం చెల్లింపునకు సంబంధించిన వోచరు అని చెప్పారని ఆమె చెబుతోంది. భవానీ ఖమ్మం జిల్లాలో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. డిపెప్ కుంభకోణంలో తన పేరు ఉన్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్నానని భవానీ అంటోంది.












Click it and Unblock the Notifications