విశాఖపట్నం: రాష్ట్ర రాజకీయ రంగం మీదికి వచ్చిన కొత్త పార్టీకి ( అన్యాపదేశంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి) ఐదు సీట్లు కూడా రావని ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి జన్మ దిన వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మోహన్ బాబు కొంత సేపు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 శాతం స్ధానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన చెప్పారు. కొత్తగా వచ్చిన పార్టీకి (చిరంజీవి పార్టీ) సంబంధించిన అన్ని విషయాలు కొద్ది కాలం వేచి చూస్తే బయటపడతాయని, తినబోతూ రుచులు అడగడం వ్యర్ధమని ఆయన వ్యాఖ్యానించారు. సుబ్బిరామిరెడ్డి వల్ల సినీమా పరిశ్రమ బాగా లాభపడిందని, సినిమా పరిశ్రమ వల్ల ఆయనకు ఒరిగిందేమీ లేదని మోహన్ బాబు అన్నారు.