హీరోగా నారా లోకేష్ మిస్ చేసుకున్న చిత్రం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషిస్తూ, మంత్రిగా రాణిస్తున్నారు నారా లోకేష్. కాలక్రమేణా తనను తాను మలచుకుని, పదునైన స్పీచ్‌లతో ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా పొలిటికల్ సర్కిల్స్‌లో దూసుకుపోతున్న లోకేష్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పాత విషయం చక్కర్లు కొడుతోంది.
క్రేజీ డైరెక్టర్ తేజ చేతుల్లో..
నారా లోకేష్ అసలు రాజకీయాల్లోకి రాకముందు.. టాలీవుడ్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సింది! నందమూరి తారకరామారావు సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు హీరోలుగా బాక్సాఫీస్‌ను ఏలుతున్నారు. అదే బాటలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన కుమారుడు నారా లోకేష్‌ను కూడా వెండితెరకు పరిచయం చేయాలని గట్టి ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ.. 'చిత్రం', 'నువ్వు నేను' వంటి ఇండస్ట్రీ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న క్రేజీ డైరెక్టర్ తేజ చేతుల్లో లోకేష్‌ను పెట్టాలని ప్లాన్ చేశారు.

డమ్మీ షూటింగ్ కూడా చేశారు
2002లో అప్పటి ప్రముఖ సినీ పత్రిక 'సంతోషం' కవర్ పేజీపై "ముఖ్యమంత్రి తనయుడు హీరోగా తేజ చిత్రం?" అంటూ ఒక పెద్ద బ్యానర్ కథనం ప్రచురితమైంది. కేవలం ప్రచారం మాత్రమే కాదు, లోకేష్ హీరోగా ఈ సినిమా డమ్మీ షూటింగ్ కూడా జరిగిందని, కొన్ని సీన్లను కూడా రికార్డ్ చేశారని టాక్. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అక్కడికక్కడే నిలిచిపోయింది. ఆ తర్వాత లోకేష్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో ఆ సినిమా చాప్టర్ క్లోజ్ అయిపోయింది.
సంచలనం సృష్టించిన 'జయం'
దర్శకుడు తేజ అప్పట్లో నారా లోకేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా సిద్ధం చేసిన ఆ లవ్ అండ్ యాక్షన్ సెంటిమెంట్ కథే.. ఆ తర్వాత టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'జయం' సినిమా! లోకేష్ నో చెప్పిన ఆ కథతోనే తేజ.. సరికొత్త కుర్రాడు నితిన్, ముంబై భామ సదాలను జంటగా పెట్టి, గోపీచంద్‌ను విలన్‌గా పరిచయం చేస్తూ 'జయం' సినిమాను తెరకెక్కించారు. 2002లో విడుదలైన 'జయం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో అప్పటివరకు ఎవరికీ తెలియని నితిన్ ఒక్క రాత్రిలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమానే నితిన్ కెరీర్‌కు గట్టి పునాది వేసింది. ఈ సినిమా లోకేష్ చేసివుంటే లవర్ బాయ్ గా కొనసాగివుండేవారేమో.












Click it and Unblock the Notifications