విజయవాడ: బెజవాడ కనకదుర్గ అమ్మవారికి శనివారం లలిత త్రిపుర సుందరీదేవి అలంకారం చేశారు. త్రిమూర్తుల కన్నా ముందునుంచి ఉంది కనుక అమ్మవారిని త్రిపుర సుందరీదేవిగా కూడా కొలుస్తారు. సరస్వతి, లక్ష్మిలు అమ్మవారికి ఇరువైపులా వింజామరలు వీస్తుండగా సదాశివుని తన ఆసనంగా మలుచుకుని అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు ప్రత్యేక పూజలు ఉండటంతో తెల్లవారుజామునుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణగా భక్తులకు దర్శనమిచారు. దసరా పండుగ వరకు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి దీవెనలు అందజేస్తారు.