నేరాన్ని అంగీకరించిన ముగ్గురు
ముంబయి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ముగ్గురు ఉగ్రవాదులు తమ నేరాన్ని అంగీకరించారు. అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదుల్లో ముగ్గురు తమ నేరాన్ని అంగీకరించారు. 2006 జులై 11వ తేదీన రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్లలో 13 మందిపై కేసు నమోదైంది. పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మందిలో తాము ఉన్నట్లు ఆ ముగ్గురు అంగీకరించారు. సాదిక్ షేక్, అరిఫ్ షేక్, సైఫ్ తాము ముంబయి పేలుళ్లలో పాల్గొన్నట్లు ఒప్పుకున్నారు. వీరిలో సాదిక్ షేక్ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒక వ్యక్తి. ఇతన్ని సెప్టెంబర్ 24వ తేదీన ముంబయిలో అరెస్టు చేశారు. అరిఫ్ షేక్ సాదిక్ తో పాటు పోలీసుల చేతికి చిక్కాడు. సెప్టెంబర్ 19వ తేదీన జామియా నగర్ లో జరిగిన ఎదురుకాల్పుల సందర్భంగా సైఫ్ అరెస్టయ్యాడు. కర్ణాటకకు చెందిన ప్రధాన సూత్రధారి రియాజ్ భక్తల్ ఆదేశాల మేరకు వారు పని చేశారని పోలీసులంటున్నారు.
మరో ఐదుగురిలో మొహమ్మద్ అతిఫ్ అమీన్, మొహమ్మద్ సాజిద్ ఉన్నారు. వీరు ఢిల్లీ ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ ఎదురు కాల్పుల తర్వాత జీషాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ సోదరుడు డాక్టర్ షెహనవాజ్ ఖాన్, అబూ రషీద్ పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications