ప్రముఖ కమ్యూనిస్టు ఓంకార్ మృతి
హైదరాబాద్: ప్రముఖ కమ్యూనిస్టు నేత మద్దికాయల ఓంకార్ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ఆయన ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. పాతికేళ్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయన పాల్గొన్నారు. సిపిఎంలో చాలా కాలం ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులకు హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
ఆయన 1984లో సిపిఎం నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై సిపిఎం నాయకత్వం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన ఎంసిపిఐని స్థాపించారు. చాలా కాలం ఆ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. కానీ, అది సాధ్యపడలేదు. ఆయన ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఉండేవారు. నర్సంపేటలో ఆయనను అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు హత్య చేయడానికి పలు మార్లు ప్రయత్నించారు.
ఓంకార్ మృతికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు సంతాపం ప్రకటించారు. మల్లు స్వరాజ్యం, రామకృష్ణ తదితర కమ్యూనిస్టు నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications