'రక్షణ కోసమే పిఎస్ కు ఎమ్మెల్యే'
మెదక్: రక్షణ దృష్ట్యా మాత్రమే తెలుగుదేశం పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర కుమార్ ను పోలీసు స్టేషన్ కు తరలించామని పోలీసు అధికారులు చెప్పారు. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయని, సాక్ష్యాలు మాత్రం ఇంకా ప్రవేశపెట్టలేదని వారు శుక్రవారంనాడు చెప్పారు. మెదక్ జిల్లా జిన్నారం పోలీసు స్టేషనులో నరేంద్రకుమార్ పై, ఆయన అనుచరులు ఐదుగురిపై హత్యాప్రయత్నం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే పొన్నూరు చైర్ పర్సన్ రుతూరాణిపై, మరో 10 మందిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మునిసిపాలిటీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన వ్యవహారం మెదక్ జిల్లాకు చేరుకుంది. కాంగ్రెసుకు చెందిన చైర్ పర్సన్ రుతూరాణి, మరో 10 మంది కౌన్సిలర్లు షిర్డికి వెళ్లి తిరిగి వస్తుండగా పొన్నూరు శాసనసభ్యుడు నరేంద్రకుమార్ తన అనుచరులతో వారిని మెదక్ జిల్లా గుమ్మడిదల అటవీ ప్రాంతంలో అడ్డగించారు. చైర్ పర్సన్ క్యాంపులో ఉన్న తమ పార్టీ కౌన్సిలర్ ఈశ్వరమ్మను తీసికెళ్లడానికి వారు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు నరేంద్ర కుమార్ తో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications