పార్లమెంటులో విహెస్, లగడపాటి లడాయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల మధ్య సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. తెలంగాణకు చెందిన వి. హనుమంతరావుకు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన లగడపాటి రాజగోపాల్ కు మధ్య జరిగిన ఈ జగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా ఈ జగడం కొనసాగింది. ఇరువురు పార్లమెంటు సభ్యులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. తెలంగాణపై లగడపాటి రాజగోపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై హనుమంతరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని, తెలంగాణలో పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడుతున్నారని హనుమంతరావు లగడపాటి రాజగోపాల్ ను ప్రశ్నించారు. దానికి రాజగోపాల్ తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో ఇరువురి మధ్య కయ్యం చోటు చేసుకుంది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి సన్నిహితుడైన సచిన్ పైలట్ సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. మాజీ పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు కూడా అక్కడే ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ పార్టీ అధిష్ఠానవర్గానికి చేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications