ఇంటిపనులు చేయటం బెస్ట్ వ్యాయామం.. WHO అధ్యయనంలో వెల్లడి!
చాలామంది ఇంట్లో పని చేయటం శారీరక వ్యాయామం క్రింద పరిగణించరు. వ్యాయామం అంటే జిమ్ కు వెళ్లి చేసేది. లేక వాకింగ్ , ప్రతీరోజూ నిర్దిష్ట సమయంలో చేసే ఎక్స్సర్ సైజ్ లుగా భావిస్తారు. అయితే అది మాత్రమే కాదు తాజా ఒక అధ్యయనం ఫిజికల్ యాక్టివిటీ పైన ఆసక్తికర రిపోర్ట్ ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ అధ్యయనంలో ఇంటిపనులు కూడా మన శారీరక వ్యాయామామే అని తేల్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం
ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, వంట చేయడం వంటి రోజువారీ ఇంటి పనులు కూడా వ్యాయామంలా పనిచేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం వెల్లడించింది. ఇవి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం ద్వారా నిపుణులు చెబుతున్నారు. WHO ప్రమాణాల ప్రకారం ప్రతి వ్యక్తికి వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ అవసరం.

ఇంటిపనులు వ్యాయామమే
నడక, సైక్లింగ్, క్రీడలతో పాటు ఇంటి పనులు కూడా ఈ లెక్కలోకి వస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు పెద్దల్లో ఒకరు, కౌమారుల్లో 81 శాతం మంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవటం అనవసరపు రోగాలకు కారణం అవుతుంది. ఇక చేసే పనులలో కూడా సాంకేతికతపై ఆధారపడటం, కదలక మెదలక కూర్చుని పని చేయటం మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
శరీరానికి కావాల్సిన కదలికలతో ఆరోగ్యం
దీంతో ఇంట్లో చేసే పనులు కూడా వ్యాయామమే అని, అవి మన శరీరానికి కావాల్సిన కదలికలను ఇస్తాయని అధ్యయనం తెల్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇల్లు తుడవడం వల్ల పొత్తికడుపు, చేతులు, భుజాల కండరాలు బలపడతాయి. బట్టలు ఉతకడం చేతులు, కాళ్లకు శక్తినిస్తుంది. వంట చేస్తూ నిలబడటం, కూరగాయలు తరగడం చేతుల పటుత్వాన్ని పెంచుతుంది. తోటపని, మొక్కలకు నీరు పోయడం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.
ఇంటి పనులు చేస్తే ఒత్తిడి మాయం
ఇంటి పనులు మనసును నిమగ్నం చేసి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. పని పూర్తయిన తర్వాత కలిగే సంతృప్తి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. అన్ని వయసుల వారికీ ఇంటి పనులు మేలు చేస్తాయి. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం, జీవన నాణ్యతపై సానుకూల ప్రభావం చూపుతాయి. పురుషుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనం సూచిస్తోంది.కుటుంబ సభ్యులు కలిసి పనులు పంచుకుంటే ఒత్తిడి తగ్గి బంధాలు బలపడతాయి.నిపుణులు ఇంటి పనిని కేవలం భారంగా కాకుండా వ్యాయామంగా చూడాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications