అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతులు ఇవ్వలేదు: తేల్చి చెప్పిన కేంద్రం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులను నిరాకరించింది. దీంతో ఆయన చేపట్టిన విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. బ్రిటన్, అమెరికాల్లో పర్యటించాలని మొదట నిర్ణయించుకున్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. దీంతో లండన్ పర్యటన ముగించుకుని ఆయన స్వదేశానికి వెనుదిరిగారు. ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి బీజం వేసింది.
నిజానికి.. ఈ నెల 30 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల్లో గడపాల్సి ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతులు లభించకపోవడం వల్ల 23వ తేదీకే హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ ఉదంతంపై ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన అమెరికా పర్యటనకు అనుమతులు ఇవ్వకపోవడం పట్ల స్పష్టత ఇచ్చారు. రాజకీయ కారణాలు ఉన్నాయంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలను కొట్టిపారేశారు.

సాధారణంగా ముఖ్యమంత్రులు లేదా ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే ముందు వివిధ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటామని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదించిన అమెరికా పర్యటన కార్యక్రమాలు ఆయన హోదాకు తగినట్లుగా లేవని తేల్చి చెప్పారు. అమెరికాలో నిర్వహించ తలపెట్టిన పర్యటన ఉద్దేశ్యానికి అవి సరిపోలట్లేదని భావించడం వల్లే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ప్రస్తుతం సాగిస్తున్న యూకే పర్యటనకు మాత్రం అన్ని రకాల రాజకీయ అనుమతులు ఇచ్చిన విషయాన్ని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని అధికారిక బృందం తెలంగాణ రైజింగ్ పేరిట లండన్‌లో పర్యటిస్తోందని, అక్కడ పెట్టుబడుల ఆకర్షణ, ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ముందుగానే సమాచారం ఇచ్చిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రైజింగ్ ప్రచారంలో భాగంగా అమెరికాలో కీలక భాగస్వామ్య పక్షాలతో సమావేశం కావలసి ఉందని, ఈ తరుణంలో పర్యటనను అడ్డుకోవడం సబబు కాదని పేర్కొంది. ఈ ఆరోపణలను రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఆ ఆలోచనే తలెత్తబోదని వ్యాఖ్యానించారు.
తమ రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పర్యటనను ప్లాన్ చేసింది. లండన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బోస్టన్ సిటీలో పెట్టుబడిదారులతో సమావేశం కావాల్సి ఉంది. ప్రవాస భారతీయులతో పాటు వివిధ బహుళజాతి ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపాల్సి ఉంది. అనుమతి నిరాకరణతో అవన్నీ కూడా రద్దయ్యాయి.













Click it and Unblock the Notifications