ఐక్య పోరుకు వామపక్షాల కార్యాచరణ
హైదరాబాద్: ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్ లకు), భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించుకున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం కార్యదర్శి బి.వి. రాఘవులు బుధవారం ఇక్కడ సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. ఐక్య ఉద్యమాల్లో భాగంగా వచ్చే నెల 20, 21 తేదీల్లో జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు.
నవంబర్ మొదటివారంలో ఇతర పార్టీలను కూడా సంప్రదించి ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నట్లు రాఘవులు మీడియా ప్రతినిధులతో చర్చించారు. కొందరు మంత్రులు కూడా పేదల పొట్ట కొడుతున్నారని ఆయన ఆరోపించారు. తాము అన్నీ చేశామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పుకోవడాన్ని నారాయణ ఎద్దేవా చేశారు. సంపన్నులకు భూములను కట్టబెట్టడంలో రాజశేఖర రెడ్డి ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేస్తున్నారనేది నిజమని ఆయన అన్నారు. పేదలకు, బలహీన వర్గాలకు, సామాన్యులకు భూములు లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications