సడెన్గా మదర్ శాంక్షన్.. రాష్ట్రాలకు రూ. 25 వేల కోట్లు నిధుల విడుదల
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విప్లవాత్మక పథకం 'వికసిత్ భారత్ జీ-రామ్-జీ' (VB-G RAM G) యోజన అధికారికంగా పట్టాలెక్కింది. ఈ సరికొత్త పథకం కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఏకంగా రూ. 25,863 కోట్ల భారీ నిధులను 'మదర్ శాంక్షన్' కింద తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం 10 గంటలకు భోపాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నిధులను నేరుగా విడుదల చేశారు. గత ఉపాధి హామీ నమూనా నుంచి ఈ నూతన విధానంలోకి మారిన ప్రయాణం ఎంతో సాఫీగా సాగిందని మంత్రి ప్రశంసించారు.
గతంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో ఈ సరికొత్త 'వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)' చట్టం (VB-G RAM G Act) జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 2025 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ ప్రతిష్టాత్మక బిల్లును ఆమోదించారు.
ఈ కొత్త చట్టం ప్రకారం.. గతంలో ఉన్న 100 రోజుల ఉపాధి హామీని ఏకంగా 125 రోజులకు పెంచారు. అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేని) శ్రమ పనులు చేయడానికి సిద్ధంగా ఉండే ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజనులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధంగా 125 రోజుల ఉపాధిని కల్పించనున్నారు. దీనివల్ల గ్రామీణ ఆదాయాలు పెరగడంతో పాటు స్థిరమైన గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది.

నిధుల బదిలీలో సరికొత్త పారదర్శకత.. పని అడిగితే ఇవ్వాల్సిందే!
ఈ కొత్త విధానంలో కార్మికులు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిర్ణీత గడువులోగా ఖచ్చితంగా పని కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం పని కల్పించడంలో విఫలమైతే, చట్ట నిబంధనల ప్రకారం సదరు కార్మికులకు 'నిరుద్యోగ భృతి' (Unemployment Allowance) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వేతనాల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యాన్ని నివారించేందుకు వార ప్రాతిపదికన లేదా మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోగా నేరుగా కార్మికుల బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాల్లోకి 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (DBT) ద్వారా నిధులు జమ చేస్తారు. గడువులోగా వేతనాలు చెల్లించకపోతే కార్మికులకు ఆలస్య పరిహారం కూడా అందుతుంది.
విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు.. ఎందుకంటే?
మరోవైపు ఈ సరికొత్త చట్టంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం నుంచి 'మహాత్మా గాంధీ' పేరును తొలగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీంతో పాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆరోపిస్తున్నాయి.
అయితే, ఈ పథకం పరివర్తనపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. పాత ఉపాధి హామీ నుంచి కొత్త 'వికసిత్ భారత్ జీ-రామ్-జీ'కి విధానాలు చాలా సాఫీగా మారాయని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, మంత్రుల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని ఆయన అభినందించారు.














Click it and Unblock the Notifications