ఇసుక తుఫానుకు తెర పడినట్లే
హైదరాబాద్ : మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, జెసి దివాకర్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదానికి తెర పడినట్లే. బుధవారం కూడా జెసి దివాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన గొల్లపల్లి సూర్యారావు వెనక్కి తగ్గారు. తాను ఆర్థిక మంత్రి కె. రోశయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ఇక ఇసుక తుఫానుకు తెర పడినట్లేనని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, ఇసుక ర్యాంపులో ప్రభుత్వానికి రావాల్సిన నిధులను రాబట్టాలని రోశయ్య ఆదేశాలు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపు కుంభకోణంలో జెసి దివాకర్ రెడ్డి ఏడు కోట్ల రూపాయలు కాజేశారని గొల్లపల్లి సూర్యారావు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురు మంత్రుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. దీంతో ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడింది.
మంత్రుల వివాదంపై విచారణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రులు కె. రోశయ్య, కోనేరు రంగారావు, జె. గీతారెడ్డిలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఇరువురు మంత్రుల వాదనలు విన్నది. అయితే తొలుత ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ మళ్లీ గొల్లపల్లి సూర్యారావు దివాకర్ రెడ్డిపై అవే ఆరోపణలు చేయడంతో మొదటికి వచ్చింది. దీంతో రెండో సారి దివాకర్ రెడ్డి రోశయ్యను కలిశారు. ఎట్టకేలకు రోశయ్య జోక్యంతో సూర్యారావు దిగి వచ్చినట్లు కనిపిస్తున్నది.












Click it and Unblock the Notifications