ముస్లింల్లో ఏకపత్నీవ్రతం: ముసాయిదా బిల్లు
కొచ్చి: ముస్లింల్లో ఏకపత్నీవ్రతాన్ని అనివార్యం చేస్తూ, దాన్ని ఉల్లంఘిస్తే శిక్ష విధించే నిబంధనను పెడుతూ కేరళ న్యాయ సంస్కరణల కమీషన్ ముసాయిదా బిల్లును రూపొందించే ఆలోచనలో ఉంది. ఏకపత్నీవ్రతం సాధారణ సూత్రమని, బహు భార్యాత్వం కొన్ని సామాజిక ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతించదగిందని, తలాఖ్ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అమలవుతుందని కేరళ ముస్లిం వివాహం, తలాఖ్ ద్వారా విడాకులు (నియంత్రణ) ప్రాథమిక ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా బిల్లును ముగ్గురు సభ్యుల కమిటీ రూపొందించింది. కమిటీలో జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ రామకృష్ణన్, బారిష్టర్ ఎంపిఆర్ నాయర్ ఉన్నారు.
ఈ ముసాయిదా బిల్లును ముస్లిం న్యాయమూర్తులకు, న్యాయవాదులకు పంపారు. పది రోజుల్లోగా అభిప్రాయం తెలియజేయాల్సిందిగా వారిని కోరారు. పదిహేను రోజుల్లోగా ఈ బిల్లును ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. భార్య రాతపూర్వకమైన అనుమతితోనే ముస్లిం పురుషుడు మరో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ లేదా న్యాయాధికారి నోటరీ ద్వారా ఆమె తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతికి తగిన కారణాలు చూపాల్సి ఉంటుంది. మొదటి భార్యకు తగిన సౌకర్యాలు, వసతులు భర్త కల్పించాల్సి ఉంటుంది. విడాకులకు సంబంధించిన నిబంధనలను కూడా కఠినతరం చేస్తూ ఈ ముసాయిదా బిల్లును రూపొందించారు.












Click it and Unblock the Notifications