గొల్లపల్లి, జెసిల మధ్య సర్దుబాటు
హైదరాబాద్: మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, జెసి దివాకర్ రెడ్డిల మధ్య సర్దుబాటు జరిగింది. వీరిద్దరి వివాదంపై విచారణ జరిపిన ఆర్థిక మంత్రి కె. రోశయ్య మంగళవారంనాడు ఆ ఇద్దరు మంత్రులతో కలిసి మీడియా ముందుకు వచ్చి సమస్య సర్దుబాటు అయిందని ప్రకటించారు. అయితే సూర్యారావు, దివాకర్ రెడ్డిలు పరస్పరం ముభావంగానే ఉన్నారు. దివాకర్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేసినట్లు గొల్లపల్లి సూర్యారావు చెప్పారు. తాను దివాకర్ రెడ్డిపై ఆరోపణలు చేయలేదని ఆయన చెప్పారు. తాను బాధితుడినని, తానేమీ మాట్లాడలేనని, అయితే రోశయ్య నిర్ణయానికి, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
సమస్య సమసిపోయిందని రోశయ్య చెప్పారు. తాను అనని మాటలు అన్నట్లుగా మీడియాలో వచ్చిందని గొల్లపల్లి సూర్యారావు అన్నారని ఆయన చెప్పారు. మీడియాపై తప్పు నెడుతున్నారని విలేకరులు అనగా సమస్య సద్దుమణిగిందని, ఈ విషయాన్ని పొడిగించవద్దని చెబుతూ రోశయ్య వెళ్లిపోయారు. ఇసుక కుంభకోణంతో దివాకర్ రెడ్డికి సంబంధం లేదని తమ విచారణలో తేలిందని అంతకుముందు ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఇసుక కుంభకోణంలో జెసి దివాకర్ రెడ్డి 7 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు గొల్లపల్లి సూర్యారావు జిల్లా పరిషత్ సమావేశంలో ఆరోపించారు.












Click it and Unblock the Notifications