వరంగల్: భారతీయ జనతాపార్టీతో పొత్తు ఉండబోదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బుధవారం ఉదయం స్పష్టం చేశారు. చిరు పార్టీ బిజెపితో దోస్తీ చేసే అవకాశముందని నిన్న ఆయన మాటలను బట్టి నేడు ప్రధాన పత్రికలన్నీ ఆ విషయంపై వార్తలు ప్రముఖంగా ప్రచురించాయి. చిరంజీవి బిజెపికి అనుకూలంగా మాట్లాడడంతో లెఫ్ట్ పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఆగ్రహించాయి. వారి అభిప్రాయాలను ఫోన్ ద్వారా తెలుసుకున్న చిరంజీవి తాను అలా అనలేదని వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. నేడు రోడ్ షోలలో కూడా చిరంజీవి బిజెపి తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. నిన్న అన్న మాటను చిరంజీవి వెనక్కి తీసుకోవడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆగ్రహించింది. చిరంజీవి పార్టీతో పొత్తు కోసం తాము వెంపర్లాడడం లేదని బిజెపి రాష్ట్ర నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు.