చిన్నారి ఆయేషాని మేనమామే చంపేసాడు
తిరుమల: మూడవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ళ అయేషా కిడ్నాప్, హత్య కేసు మిస్టరీ మొత్తానికి వీడిపోయింది. ఆ పాప మేనమామ హాబీబ్, అతని స్నేహితులు శివ, నరసింహులు డబ్బులకోసం పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితులు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. దాంతో హబీబ్, శివయ్య, నరసింహులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి చెప్పిన వివరాలు ప్రకారం...హాబీబ్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం తన అక్క కూతురు ఆయేషాను కిడ్నాప్ చేసి డబ్బులు దండుకోవాలని పథకం పన్నాడు. దీన్ని అమలు చేయడానికి రాజంపేటలోని తన పాత స్నేహితులు శివ, నరసింహులు (వీరిద్దరూ అన్నదమ్ములు) సాయం తీసుకున్నాడు. గురువారం సాయంత్రం స్కూలు వ్యాను దిగిన ఆయేషాను కాపుకాచి తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకున్న హాబీబ్ రహస్య ప్రదేశంలో ఉన్న తన స్నేహితుల వద్ద వదిలిపెట్టి ఏమీ తెలియనట్లు తిరిగి ఆయేషా ఇంటికి వచ్చాడు.
ఇక్కడ బిడ్డ కోసం వెదుకులాడుతున్నట్లు నటిస్తూనే గుట్టు రట్టవుతుందన్న భయంతో రాత్రి 7 గంటల సమయంలో స్నేహితులను కలిసి పాపను గొంతు నులిమి చంపేశాడు. తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్‌కు అతి దగ్గరలో ఉన్న రాములవారి గుడి వద్ద, జన సంచారం ఉన్న రోడ్డుపై నిలిపి ఉన్న లారీ చాటు చేసుకుని ఆయేషాను హతమార్చి అదే లారీలో పడుకోబెట్టి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అయితే స్కూలు వ్యాను దిగిన ఆయేషాను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్ళిన హాబీబ్‌ను ఆయేషాతో పాటు చదువుతున్న ఇద్దరు చిన్నారులు గుర్తించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో మొత్తం గుట్టురట్టయ్యింది.
మృతురాలు అయేషా ఇంటి వద్దనే హంతకుడైన మేనమామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం రాజంపేటకు బయలుదేరి వెళుతున్న హాబీబ్ స్నేహితులు శివ, నరసింహులను పోలీసులు దారికాచి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కిడ్నాప్ చేసిన ఆయేషాను కిడ్నాపర్లు సాయంత్రం 5 గంటల నుంచి ఏడు గంటల వరకు మోటారు సైకిల్‌పై నగరమంతా తిప్పుతూ గడిపారు.
ఆ చిన్నారికి తినుబండారాలు తీసి ఇస్తూ చివరికి గొంతునులిమి చంపేశారు. కాగా తన కూతురు హత్యగావింపబడిన విషయం ఆయేషా తల్లి నూర్జహాన్‌కు శుక్రవారం సాయంత్రం వరకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పచ్చిబాలింత అయిన నూర్జహాన్‌కు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంటికి కేబుల్ లైన్ కట్ చేశారు. అంతేకాకుండా గురువారం రాత్రే నూర్జహాన్‌ను ఆమె స్వస్థలమైన రాజంపేటకు తీసుకెళ్లారు. ఆయేషా మతదేహాన్ని శుక్రవారం సాయంత్రం రాజంపేటకు తరలించారు.












Click it and Unblock the Notifications