బంగాళాఖాతంలో వాయుగుండం
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలోను, మన రాష్ట్రంలో మచిలీపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం చుట్టూ తీవ్రమైన అలజడి నెలకొందని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. తీరం వెంబడి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఇది మరింత బలపడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చాలాచోట్ల ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. దీంతోపాటు ఇతర కోస్తా జిల్లాల్లోను అక్కడక్కడా జల్లులు పడతాయి. ఇప్పటికే కోస్తా తీరం అంతటా ఆకాశం మేఘావృతమై ఉంది. తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వివిధ పోర్టుల్లో ప్రమాద సూచికలు ఎగురవేశారు.












Click it and Unblock the Notifications