వైయస్ పై పోటీకి సిద్ధం: పరిటాల సునీత
హిందూపురం : తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశిస్తే కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత అన్నారు. పులివెందుల నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జెసి దివాకర్ రెడ్డి నియోజకవర్గం తాడిపత్రి నుంచి పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. మొద్దు శీను హత్యపై చంద్రబాబు ఏ విచారణ కోరినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు మాట మారుస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు.
మొద్దు శ్రీను హత్య అనంతరం వెంకటాపురంలోని పరిటాల ఘాట్ దగ్గర పొట్టేళ్ళను నరికి సంబరాలు చేసుకున్నట్లు ఆరోపించిన మంత్రులు అది నిజమని నిరూపించగలరా? అని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా గ్రామానికి వచ్చి నిజాలు తెలుసుకోవచ్చన్నారు. మొద్దు శీను పట్టుబడిన రోజున, ఇక్కడి జిల్లా జైలుకు తీసుకువచ్చిన రోజున కాంగ్రెస్ నేతలు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారని ఆమె విమర్శించారు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మరేమీ రాని మంత్రి రఘువీరారెడ్డి మాటల్ని ఎవరూ పట్టించుకోరని సునీత అన్నారు. వివరాలు పూర్తిగా తెలుకొని మాట్లాడకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. వైఎస్, రోశయ్య ఓ పథకం ప్రకారం కేసును తప్పు దోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications