వంద రోజుల్లో తెలంగాణ: అద్వానీ

దేశంలో ఇప్పటికే ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఇచ్చిన చరిత్ర ఎన్డీఏకే ఉందని గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించి, తెలంగాణ రాష్ట్రసమితి(తెరాస)తో కలిసి పోటీ చేసిందని, కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రజలను వంచించిందని అన్నారు. రాజకీయంలో అత్యంత ఇష్టమైన పదం ఏమిటని తనను మీడియా ప్రతినిధులు అడిగితే విశ్వసనీయత అని చెప్పానని, చెప్పిన మాటకు కట్టుబడడం తన నైజమని, తెలంగాణ రాష్ట్రాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణవాసుల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రే విశ్వాస ఘాతుకాల చరిత్ర అని ధ్వజమెత్తారు. పేద, మధ్యతరగతి వారి కోసం కృషిచేస్తామని, సామాన్యుడి చెంత కాంగ్రెస్ హస్తం అని 2004 ఎన్నికలకు ముందు చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో కేవలం ధనికుల కోసమే పని చేస్తోందని ఆరోపించారు. గడిచిన అయిదేళ్లలో యూపీఏ దేశానికి ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి కూడా లేదన్నారు. 2004-2009 మధ్యకాలాన్ని నమ్మక ద్రోహ కాలంగా ఆయన అభివర్ణించారు. కేవలం ఏడుసీట్ల ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూపీఏ అయిదేళ్లలో సామాన్యులకు చేసింది శూన్యమన్నారు.












Click it and Unblock the Notifications