విశాఖపట్నం: తాము ఇందిరమ్మ లాగే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము పాజిటివ్ ఓటుతో గెలుస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసును గెలిపించకపోతే పాపం చుట్టుకుంటుందనే భావన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. తమకు ప్రజల అవసరాలను గుర్తించే మనసు ఉందని, వాటిని పరిష్కరించే నేర్పరితనం కూడా తమకే ఉందని ఆయన అన్నారు.
తాము 1300 కోట్ల రూపాయల బిసి స్కాలర్ షిప్ లు విడుదల చేశామని ఆయన చెప్పారు. బిసిలకు తామే పెద్ద యెత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినట్లుగానే ఇబిసిలకు కూడా ఇస్తామని ఆయన చెప్పారు.