బాబు, కెసిఆర్ సహా విపక్ష నేతల అరెస్టు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ దరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు మంగళవారం చేపట్టిన చలో రాజభవన్ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రతిపక్షనేతలను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు (టిడిపి), కె. చంద్రశేఖరరావు (తెరాస), బివి రాఘవులు (సిపిఎం), కె. నారాయణ (సిపిఐ)లు రాజభవన్ ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్థితిలో వారితో పాటు పలువురు ప్రతిపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులను నిరసిస్తూ ప్రతిపక్షాల నేతలు బంజారాహిల్స్ పోలీసు స్టేషను ముందు ధర్నాకు దిగారు. అరెస్టుకు నిరసనగా కార్యకర్తలు పోలీసు స్టేషన్ అద్దాలు పగులగొట్టారు.
ప్రతిపక్షాల నేతలను పోలీసులు పంజగుట్ట పోలీసు స్టేషనుకు తరలించారు. ప్రభుత్వం తమ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఇంత ఐక్యంగా ముందుకు రావడం ఇదే మొదటిసారి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. మిత్ర పక్షాల ఐక్యత వర్ధిల్లాలని కూడా వారు నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications