ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు మరో తీవ్ర పరిణామం చోటు చేసుకుంటోంది. ముంబై పేలుళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇప్పటికే రాజీనామా చేయగా, అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో కాంగ్రెస్ నేత నారాయణ్ రాణేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవికి పోటీపడ్డ రాణేను కాదని అశోక్ చవాన్‌ను అందలం ఎక్కించడంతో ఆయన మండిపడ్డారు. 30 ఏళ్లపాటు శివసేనలో నేతగా ఉన్న రాణే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్‌లో చేరాననీ, ఇచ్చిన మాట తప్పారని అధిష్టానంపై విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత్రి సోనియాపై నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. రాణే మాటలను పార్టీ తీవ్రంగా తీసుకుని ఆయనను సస్పెండ్ చేసింది.