పురుషాంగంపై కొవ్వొత్తితో కాల్చి..
విశాఖపట్నం: దొంగతనం అంగీకరించమంటూ..స్ధానిక పోలీసులు ఇద్దరు ఐటీఐ విద్యార్థులను మూడు రోజులు నిర్బంధించి విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టిన సంఘటన సంచలనమై నిలిచింది. వారి పురుషాంగంపై కొవ్వొత్తిని కాల్చి మైనపు చుక్కలు వేసి,వీపుపైన, చేతుల పైనా కర్రలతో కొట్టి నరకం చూపించారు.
విశాఖలోని మాధవధారకి చెందిన రాధాకృష్ణమూర్తి ఇంట్లో గతనెల 10నసెల్‌ఫోను, 10 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అదే వీధిలో మరో ఇంట్లో రెండు సెల్‌ఫోన్ల దొంగతనం జరిగింది. రాధాకృష్ణమూర్తి తన ఇంట్లో జరిగిన దొంగతనంపై అయిదో పట్టణ పోలీసులకు అప్పుడే ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన ఇంటికి ఎదురింట్లో ఉంటున్న కంచరాన జగదీష్, కంచరాన మోహన్ అనే అన్నదమ్ములిద్దరూ ఈ సెల్‌ఫోన్లను సిమ్‌కార్డులు మార్చి వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వీరిద్దరూ ఐటీఐ చదువుకుంటూ..రాత్రుళ్లు ఒక దిన పత్రికలో ప్యాకింగ్ సెక్షన్‌లో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈనెల 4న తెల్లవారుజామున విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి వస్తుండగా బిర్లా జంక్షన్ వద్ద పోలీసులు తమను అరెస్టు చేసి తీసుకువెళ్లినట్లు నిందితులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం నిందితులను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. తమను పోలీసులు మూడు రోజులుగా చిత్రహింసలకు గురిచేశారని నిందితులు న్యాయమూర్తికి తెలియజేశారు.
ఎస్సై మల్లికార్జునరావు తమను లాకప్‌లో పెట్టి చిత్రవధచేశారని, దొంగతనం అంగీకరించమని శారీరకంగా హింసించారని చెప్పారు. దీంతో న్యాయమూర్తి నిందితులిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని పోలీసులను ఆదేశించారు. ఒంటిమీద తీవ్రగాయాలైన జగదీష్, మోహన్‌లు నడవలేని పరిస్థితులో ఉండగా కవర్ చేస్తున్న మీడియాకు చిక్కకుండా వారిద్దరినీ ఆటోలో ఆసుపత్రికి తరలించారు.
నిందితుల్లో మోహన్ పురుషాంగంపై కొవ్వొత్తితో కాల్చినట్లు గుర్తులుండడాన్ని డ్యూటీ డాక్టర్ హరికృష్ణ గుర్తించారు. జగదీష్ వీపుపైన, చేతుల పైనా కర్రలతో కొట్టిన గాయాలున్నాయి. ఇవి మూడు రోజుల కిందటే తగిలి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications