కెసిఆర్ పై దేవేందర్ నిప్పులు
హైదరాబాద్: మహాకూటమిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేరికపై నవ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ నిప్పులు చెరిగారు. తన సొంతరాజకీయావసరాలు, కుటుంబ ప్రయోజనాల కోసం తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ వైఖరిని ఎదుర్కొనేందుకు తెలంగాణ మేధావులు, విద్యార్థులు, యువకులు సిద్ధం కావాలన్నారు. కెసిఆర్ తెలంగాణను నవ్వుల పాలు చేస్తే తాము ఉద్యమాన్ని బతికించుకుంటూ వచ్చామని ఆయన చెప్పారు. తాను ఫోన్ చేస్తే కూడా కెసిఆర్ మాట్లాడలేదని, అంత అహంకారపూరితంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు వంతులవారీగా సీఎం పదవిని అప్పగించేందుకు తెరాసతో పాటు వామపక్షాలు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్న వై.ఎస్.పై ఉద్యమించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో తాను ఉన్నంత వరకే ఉద్యమాలు చేసినట్లు ఆయన చెప్పుకున్నారు. అయిదేళ్లపాటు మాటలతో ప్రజలను మోసగించిన కేసీఆర్ ఆటలు ఇక సాగవని దేవేందర్ చెప్పారు.












Click it and Unblock the Notifications