'సాక్షి' నిధులపై లోకసభలో రభస
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి దినపత్రిక నిధులపై గురువారం లోకసభలో తీవ్ర దుమారం చెలరేగింది. సాక్షి దినపత్రికను ప్రచురిస్తున్న జగతి పబ్లికేషన్స్ కు నిధులు సమకూర్చిన పద్ధతులపై చర్చకు అనుమతించాలని మహాకూటమి సభ్యులు పట్టుబట్టారు. జగతి పబ్లికేషన్స్ కు అక్రమంగా నిధులు సమకూర్చారని వారు ఆరోపించారు. ఎంతగా చెప్పిన సద్దుమణగకపోవడంతో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
జగతి పబ్లికేషన్స్ కు నిధుల మళ్లింపుపై చర్చ జరగాల్సిందేనని మహా కూటమి సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. సభ్యులు ఎంతగా అరిచినా సభను వాయిదా వేయబోనని, ప్రజలు ఇదంతా చూడాలని సోమనాథ్ ఛటర్జీ అన్నారు. ప్రజలను అవమానిస్తున్నారని, ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణమేదీ లేకుండా గొడవ చేస్తున్నారని ఆయన అన్నారు. చివరకు సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications